BHRC 2025-03-07 12:32:54
సర్వేకల్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- దేశంలో అత్యంత వేగంగా ఈ క్యాన్సర్ వ్యాపిస్తోంది
- మహిళారోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది
- సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బి సందీప్
- ప్రతీ మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
- బీహెచ్ ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షులు మణిశర్మ
- బీహెచ్ ఆర్‌సీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
(శ్రీకాకుళం)
సర్వేకల్ క్యాన్సర్ పట్ల ప్రతీ మహిళా అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బి సందీప్ అన్నారు. నగరంలోని రైతుబజారుకు ఆనుకొని ఉన్నమెప్మా భవనంలో భారతీయ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ సందీప్ మాట్లాడుతూ సాధారణ పాప్ టెస్ట్‌లు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయన్నారు. కాబట్టి గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవి తప్పనిసరి అని, 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాని సూచించారు. హెచ్‌పివి (హ్యుమన్ పాపిల్లో వ్యాక్సిన్) 17 ఏళ్లు దాటిన ప్రతీ మహిళా తప్పనిసరి వేసుకోవాలన్నారు. తద్వారా సర్వెకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. భారతీయ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన ఉండాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు రచిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక మహిళ అన్న విషయం మనం మననం చేసుకోవాలన్నారు. ప్రతీ కుటుంబంలో మహిళే ఆ ఇంటికి మహరాణి అని, సమస్యలను ఎదుర్కోవడంలో మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షులు వావిలాపల్లి జగన్నాథంనాయుడు మాట్లాడుతూ ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగంగా స్త్రీ పురుష వివక్షతను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సీహెచ్ మౌనిక, షేక్ మహరాజ్, గైనికాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, బీహెచ్ ఆర్‌సీ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య, నర్మజ తదితరులు పాల్గొన్నారు.